Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Telugu Holy Bible Wordproject Bible
41 verses
1అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను
2జ్ఞానములేని మాటలు చెప్పిఆలోచనను చెరుపుచున్న వీడెవడు?
3పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము.
4నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి?నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.
5నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము.
6దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.
7ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును1 ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?
8సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు?
9నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసి నప్పుడు నీవుంటివా?
10దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు
11నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?
12అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించు నట్లును
13అది దుష్టులను తనలోనుండకుండ దులిపివేయునట్లును నీ వెప్పుడైన ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా?
14ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునొందును విచిత్రమైన పనిగల వస్త్రమువలె సమస్తమును కన బడును.
15దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరుగగొట్టబడును.
16సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా?మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా?
17మరణద్వారములు నీకు తెరవబడెనా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా?
18భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసివయెడల చెప్పుము.
19వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది?చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది?
20దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా?ఇదంతయు నీకు తెలిసియున్నది గదా.
21నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.
22నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా?
23ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధ దినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా?
24వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖ ముఖములను వ్యాపించును?
25నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును
26పాడైన యెడారిని తృప్తిపరచుటకునులేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను
27ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు?
28వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?
29మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?
30జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
31కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
32వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా?
33ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?
34జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా?
35మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా?
36అంతరింద్రియములలో2 జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు3 తెలివి నిచ్చినవాడెవడు?
37జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?
38ధూళి బురదయై పారునట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించు వాడెవడు?
39ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా?
40సింహపుపిల్లలు తమ తమ గుహలలో పండుకొను నప్పుడు తమ గుహలలో పొంచి యుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా?
41తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?