Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Telugu Holy Bible Wordproject Bible
20 verses
1పెతూయేలు కూమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యోహోవా వాక్కు
2పెద్దలారా, ఆలకించుడి దేశపు కాపురస్థులారా, మీరందరు చెవియొగ్గి వినుడి ఈలాటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలోగాని జరిగినదా?
3ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియజేయుదురు.
4గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసి యున్నవి మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసి యున్నవి.పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసి యున్నవి.
5మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి ద్రాక్షారసపానము చేయువారలారా, రోదనము చేయుడి.క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండ నాశ మాయెను,
6లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చియున్నది వాటి పళ్లు సింహపు కోరలవంటివి వాటి కాటు ఆడుసింహపు కాటువంటిది.
7అవి నా ద్రాక్షచెట్లను పాడుచేసియున్నవి నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికి యున్నవి బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లకొమ్మలు తెలుపాయెను
8పెనిమిటి పోయిన ¸°వనురాలు గోనెపట్ట కట్టు కొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము.
9నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండ నిలిచి పోయెను. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు అంగలార్చు చున్నారు.
10పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైలవృక్షములు వాడిపోయెను.
11భూమిమీది పైరు చెడిపోయెను గోధుమ కఱ్ఱలను యవల కఱ్ఱలను చూచి సేద్యగాండ్లారా, సిగ్గునొందుడి.ద్రాక్షతోట కాపరులారా, రోదనము చేయుడి.
12ద్రాక్షచెట్లు చెడిపోయెను అంజూరపుచెట్లు వాడి పోయెను దానిమ్మచెట్లును ఈతచెట్లును జల్దరుచెట్లును తోట చెట్లన్నియు వాడిపోయినవి నరులకు సంతోషమేమియు లేకపోయెను.
13యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసికొని రాత్రి అంతయు గడపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిర మునకు రాకుండ నిలిచిపోయెను.
14ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి.
15ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును.
16మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను మన ఆహారము నాశనమాయెను.
17విత్తనము మంటిపెడ్డల క్రింద కుళ్లిపోవుచున్నది పైరు మాడిపోయినందున ధాన్యపుకొట్లు వట్టి వాయెను కళ్లపుకొట్లు నేలపడియున్నవి.
18మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొఱ్ఱమందలు చెడిపోవుచున్నవి.
19అగ్ని చేత అరణ్యములోని మేతస్థలములు కాలిపోయినవి మంట తోటచెట్లన్నిటిని కాల్చివేసెను యెహోవా, నీకే నేను మొఱ్ఱ పెట్టుచున్నాను.
20నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేతస్థలములు కాలిపోవుటయు చూచి పశువులును నీకు మొఱ్ఱ పెట్టుచున్నవి.