Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Telugu Holy Bible Wordproject Bible
27 verses
1రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు.
2నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును.
3రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు.
4క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?
5లోలోపల ప్రేమించుటకంటె బహిరంగముగా గద్దించుట మేలు
6మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును.
7కడుపు నిండినవాడు తేనెపట్టునైనను త్రొక్కి వేయును. ఆకలిగొనినవానికి చేదువస్తువైనను తియ్యగా నుండును.
8తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు.
9తైలమును అత్తరును హృదయమును సంతోషపరచు నట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును.
10నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచి పెట్టకుము నీకు అపద కలిగిన దినమందు నీ సహోదరుని యింటికి వెళ్లకుము దూరములోనున్న సహోదరునికంటె దగ్గరనున్న పొరుగువాడు వాసి,
11నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృద యమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.
12బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.
13ఎదుటివానికొరకు పూటబడినవాని వస్త్రము పుచ్చు కొనుము పరులకొరకు పూటబడినవానివలన కుదువపెట్టించుము.
14వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచ బడును.
15ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళియైన భార్యయు సమానము
16దానిని ఆపజూచువాడు గాలిని అపజూచువాని తోను తన కుడిచేత నూనె పట్టుకొనువానితోను సమా నుడు.
17ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.
18అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానుని మన్నించువాడు ఘనతనొందును.
19నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరియొకని మనస్సు కనబడును.
20పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానే రదు ఆలాగున నరుల దృష్టి తృప్తికానేరదు.
21మూసచేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తిచేత నరుని పరిశోధింపవచ్చును.
22మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదలిపోదు.
23నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము.
24ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా?
25ఎండిన గడ్డి వామివేయబడెను పచ్చిక కనబడు చున్నది కొండగడ్డి యేరబడియున్నది
26నీ వస్త్రములకొరకు గొఱ్ఱపిల్లలున్నవి ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును
27నీ ఆహారమునకు నీ యింటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును.