Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Telugu Holy Bible Wordproject Bible
18 verses
1యెహోవా, నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొఱ్ఱపెట్టునాడు
2నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక నా మొఱ్ఱకు చెవి యొగ్గుము
3నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది.
4సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేనివానివలె అయితిని.
5చచ్చినవారిలో విడువబడినవాడనైతిని నేను సమాధిలో పడియున్న హతులలో ఒకనివలె అయితిని నీవిక స్మరింపనివారివలె అయితిని వారు నీ చేతిలోనుండి తొలగిపోయి యున్నారు గదా.
6అగాధమైన గుంటలోను చీకటిగల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి యున్నావు.
7నీ ఉగ్రత నామీద బరువుగా నున్నది నీ తరంగములన్నియు నన్ను ముంచుచున్నవి. (సెలా.)
8నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచి యున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావల్ల గాకుండ నేను బంధింపబడి యున్నాను
9బాధచేత నా కన్ను క్షీణించుచున్నది యెహోవా, ప్రతిదినము నేను నీకు మొఱ్ఱపెట్టు చున్నాను నీవైపు నా చేతులు చాపుచున్నాను.
10మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా?(సెలా.)
11సమాధిలో నీ కృపను ఎవరైన వివరింతురా? నాశనకూపములో నీ విశ్వాస్యతను ఎవరైన చెప్పు కొందురా?
12అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా?
13యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును.
14యెహోవా, నీవు నన్ను విడుచుట యేల? నీ ముఖము నాకు చాటు చేయుట యేల?
15బాల్యమునుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయముచేత నేను కలవరపడుచున్నాను.
16నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది నీ మహా భయములు నన్ను సంహరించి యున్నవి.
17నీళ్లు ఆవరించునట్లు అవి దినమంత నన్ను ఆవరించు చున్నవి అవి నన్ను చుట్టూర చుట్టుకొని యున్నవి
18నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గమాయెను.